ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర చిరస్మరణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే పరమావధిగా జీవించిన ధీశాలి అని కొనియాడారు.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే ఆవిర్భవించిందని కేటీఆర్ గుర్తుచేశారు. జలదృశ్యం వేదికగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని ఆయన పేరును హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టి గౌరవించిందని పేర్కొన్నారు. మరోవైపు హరీశ్ రావు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు. పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన నాయకత్వమని తన ఆచరణతో చాటిన గొప్ప దార్శనికుడని అన్నారు.
స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన జీవితం నిరంతర పోరాటానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం స్ఫూర్తిదాయకమని హరీశ్ రావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు.