జూరాల ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. సోమవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే ఎండాకాలం నీటి కొరతను సాకుగా చూపడం సమంజసం కాదని అన్నారు.
జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉందని డీకే అరుణ తెలిపారు. వేసవిలో నీటి ఇబ్బందులు ఎదురైతే ఎగువన ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదికి వరదలు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. రైతులు సైతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.
జూరాల ఆయకట్టు రైతుల ఆందోళనకు అండగా ఉంటామని డీకే అరుణ స్పష్టం చేశారు. ఆదివారం జూరాల ప్రాజెక్టు కింద కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జూరాల డ్యాం గద్వాల ఆత్మకూరు రహదారి కర్నూలు గద్వాల రహదారితో పాటు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి డీకే అరుణ ఫోన్ చేసి జూరాల ఆయకట్టు పరిస్థితిని వివరించారు. సాగు చేసిన పంటలను కాపాడేందుకు రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని మంత్రిని కోరారు.