
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉండటంతో తెలంగాణలో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
సోమవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 21న వాయుగుండంగా 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.
సెప్టెంబర్ 23 ఉదయం నాటికి ఈ వ్యవస్థ దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
