తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.5,454 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునికీకరణతో పాటు 100 కొత్త రైళ్లను ప్రవేశపెట్టామని చెప్పారు. తెలంగాణకు ఐదు వందే భారత్‌ రైళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.

అమృత్‌ భారత్‌ పథకం కింద రాష్ట్రంలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను చేపట్టినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం జోగుళాంబ, గద్వాల, మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి ఏడాదికి సగటున రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికే 2025-26లో రూ.5,454 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

రైల్వే లైన్ల నిర్మాణంలోనూ గణనీయమైన పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి సగటున 87 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరగగా, 2014 తర్వాత ఈ వేగం 880 కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

By Rajini