ఆన్‌లైన్ క్యాబ్ బుక్ చేసుకునే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్ యాప్‌లలో ప్రయాణం ప్రారంభం కాకముందే కనిపించే “ముందస్తు టిప్” లేదా “యాడ్-ఆన్ ఎంచుకోండి” వంటి ఆప్షన్లను తొలగించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ప్రయాణికులు డ్రైవర్‌కు టిప్ ఇవ్వడం పూర్తిగా వారి ఇష్టమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, టిప్ ఇవ్వాలనుకుంటే అది రైడ్ పూర్తయిన తర్వాత మాత్రమే యాప్‌లో అందుబాటులో ఉండాలి. ప్రయాణం ప్రారంభానికి ముందు టిప్ అడగడం ప్రయాణికుల్లో గందరగోళానికి దారితీస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ముందుగానే టిప్ ఇస్తే డ్రైవర్ రైడ్‌ను త్వరగా అంగీకరిస్తారనే అపోహ కూడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగా, ప్రయాణ అనుభవంతో సంబంధం లేకుండానే కొందరు ప్రయాణికులు ముందస్తుగా టిప్ ఇస్తున్నారని తెలిపింది.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్, 2025లోని సెక్షన్ 14.15కు అనుగుణంగా తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌లను సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలని అన్ని క్యాబ్ అగ్రిగేటర్లను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఇకపై క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో లేదా ప్రయాణం ప్రారంభమయ్యే ముందు ముందస్తు టిప్ ఆప్షన్ కనిపించదు. రైడ్ పూర్తయిన తర్వాత ప్రయాణికులు తమకు నచ్చితే డ్రైవర్‌కు టిప్ ఇవ్వవచ్చు. అంతేకాదు ప్రయాణికులు ఇచ్చే టిప్‌పై క్యాబ్ కంపెనీలు ఎలాంటి కమీషన్ తీసుకోకూడదు. అంటే ప్రయాణికుడు ఇచ్చిన టిప్ మొత్తం డ్రైవర్‌కే చేరాలి.

By Rajini