ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పిపల్‌కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌లోకి భారీగా వరద నీరు ఒక్కసారిగా ప్రవేశించింది. సాయంత్రం 6.30 నుంచి 6.45 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో HCCకి చెందిన సిబ్బంది టన్నెల్‌లో నిర్మాణ పనులు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటివరకు 20 మందిని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. వారిలో ఏడుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 13 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని బేస్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని NDRF, భారత సైన్యం, ITBP బృందాలను సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేశారు. టన్నెల్‌లో మరో ఇద్దరు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీగా నీరు చేరడంతో సహాయక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్, NDRF అధికారి అమృత్ లాల్ మీనా సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని తెలిపారు. అన్ని సంబంధిత సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

By Rajini