
తెలంగాణలో జనసేన రాజకీయంగా బరిలోకి దిగాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దించాలని పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్‌కు మంచి క్రేజ్, ప్రజాదరణ ఉందని.. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే జనసేన బలమైన శక్తిగా ఎదగవచ్చని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు చేస్తూ.. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి, ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కోరారు. తెలంగాణలో జనసేనకు మంచి రాజకీయ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని జనసేన పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఓ వీడియోను విడుదల చేసిన రాజాసింగ్ .. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ.. బలమైన రాజకీయ, ప్రజల మద్దతును సాధించిందని పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన ఇక్కడ రాజకీయంగా క్రియాశీలకంగా మారాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూశారని రాజాసింగ్ విమర్శించారు. ఈ 2 ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
