
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇటీవల పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో తండ్రి సల్మాన్ తన కుమారుడు అర్మాన్‌పై దాడికి పాల్పడ్డాడు.
బాలుడిని పిల్లర్‌కు బలంగా కొట్టి అనంతరం నేలపై పడేసినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా డీసీఎం వాహనం కిందకు బాలుడిని తోసేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవే ఈ దారుణ ఘటనకు కారణంగా తెలుస్తోంది. భార్యతో వివాదం జరుగుతున్న సమయంలో సల్మాన్ తన కుమారుడిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్మాన్.. మంగళవారం మృతి చెందాడు.
బాలుడి మృతితో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితుడు సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
