D Spiritual: Jul 16: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

హైదరాబాద్‌లోని వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని వాహనదారులను పోలీసులు కోరారు.

జగన్నాథ రథయాత్రల్లో మొదటిది ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమై అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రీ, అబిడ్స్, కోటి, మలక్‌పేట్ మీదుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుంది. రెండో రథయాత్ర బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని జగన్నాథ ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రెండు రథయాత్రల మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి ఫిల్మ్‌నగర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెం.1, రోడ్ నెం.10, జహీర్‌నగర్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మార్గం వైపు మళ్లించనున్నారు. అలాగే ఏసీబీ ఆఫీస్ బై-లేన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా హాస్పిటల్, అపోలో జంక్షన్ మార్గాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని సూచించారు.

అదేవిధంగా షేక్‌పేట్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల నుంచి రోడ్ నెం.12 వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.10, జహీర్‌నగర్, రోడ్ నెం.1 మీదుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణాల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.