D News: Jul 16: హైదరాబాద్‌ ప్రైవేట్‌ స్కూల్‌లో ఖురాన్‌ హోంవర్క్‌ వివాదం.. కలకలం రేపిన ఘటన

హైదరాబాద్‌ పాతబస్తీలోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో మతపరమైన పాఠాలు బోధిస్తున్నారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఖురాన్‌కు సంబంధించిన పాఠాలను హోంవర్క్‌గా ఇచ్చారంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, బీజేపీ, ఏబీవీపీ నాయకులు స్కూల్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.

విద్యార్థి స్కూల్‌ డైరీలో కల్మా, సురా ఫాతిహా చదవాలని హోంవర్క్‌ రాసి ఉండటాన్ని గమనించిన తల్లి వెంటనే పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్‌ ఎలా ఇస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్కూల్‌ యాజమాన్యం స్పందించి, హోంవర్క్‌ ఇచ్చిన ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల వద్ద నిరసనకు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, స్కూల్‌ను ముట్టడించేందుకు వచ్చిన పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. స్కూల్‌ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, ఉపాధ్యాయుడితో పాటు యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా, స్కూల్‌ ఎండీ స్పందిస్తూ ఈ ఘటన పూర్తిగా ఉపాధ్యాయుడి వ్యక్తిగత తప్పిదమేనని, యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. తమ పాఠశాలలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని, వివాదం అనంతరం విద్యార్థి తండ్రితో కూడా చర్చించినట్లు చెప్పారు. ఘటన తీవ్రతరం కావడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.