D Sports: Jul 16: MLC 2026: టీ20 చరిత్రలో కొత్త అధ్యాయం.. 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన వాషింగ్టన్ ఫ్రీడం

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో వాషింగ్టన్ ఫ్రీడం, ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం 267 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి టీ20 చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్ రికార్డును సృష్టించింది. మ్యాచ్ మొత్తం 51 సిక్సర్లు, మూడు సెంచరీలు, 536 పరుగుల అగ్రిగేట్‌తో అభిమానులకు అసలైన బ్యాటింగ్ విందు అందించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వాషింగ్టన్ ఫ్రీడం కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 270 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో టీ20 చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్‌గా ఈ మ్యాచ్ రికార్డుల్లో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఛేదించిన 265 పరుగుల రికార్డు ఇప్పుడు రెండో స్థానానికి చేరింది.

ఈ మ్యాచ్‌లో మొత్తం 51 సిక్సర్లు నమోదవడం మరో విశేషం. ఎంఐ న్యూయార్క్ బ్యాటర్లు 29 సిక్సర్లు బాదగా, వాషింగ్టన్ ఫ్రీడం 22 సిక్సర్లు నమోదు చేసింది. టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 50కు పైగా సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే వాషింగ్టన్ ఫ్రీడం చేసిన 270/4 స్కోరు మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. ఇంతకుముందు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ చేసిన 269/5 స్కోరే రికార్డుగా ఉండేది.

ఇరు జట్లు కలిపి మొత్తం 536 పరుగులు చేయడంతో ఇది టీ20 చరిత్రలో రెండో అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్‌గా నమోదైంది. 2024 ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు–సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన 549 పరుగులే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం మరో చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఎంఐ న్యూయార్క్ తరఫున నికోలస్ పూరన్ 106 పరుగులు చేయగా, వాషింగ్టన్ ఫ్రీడం తరఫున ఆండ్రీస్ గౌస్ 132 పరుగులు, స్టీవ్ స్మిత్ అజేయంగా 110 పరుగులు చేశారు. టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి.

గౌస్, స్టీవ్ స్మిత్ మూడో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి దేశీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యంగా రికార్డు సృష్టించారు. అలాగే మేజర్ లీగ్ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి అమెరికా బ్యాటర్‌గా ఆండ్రీస్ గౌస్ చరిత్ర సృష్టించాడు.

నికోలస్ పూరన్ తన సెంచరీని కేవలం 31 బంతుల్లో పూర్తి చేసి ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 2013 ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ మాత్రమే అతని కంటే వేగంగా ఉంది. అంతేకాకుండా పూరన్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఎంఎల్‌సీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

మరోవైపు వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్ తన కెరీర్‌లో 1001వ సిక్సర్ బాది టీ20 క్రికెట్‌లో వెయ్యికి పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.