
D Spiritual: Jul 13: ప్రత్యేక సోమవారం: ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి అరుదైన కలయిక
ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, చతుర్దశి ఒకే రోజున రావడం అత్యంత అరుదైన యోగంగా భావిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని, జాతక దోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు తగ్గి, కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో పేర్కొన్నారు.
ఈ రోజున ఉదయాన్నే నల్ల నువ్వులు కలిపిన నీటితో తలస్నానం చేసి, తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి శివారాధన చేయడం శుభప్రదం. ఇంట్లో లేదా శివాలయంలో శివలింగానికి పంచామృతాలు, నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసం లేదా కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
శివాలయానికి వెళ్లి జిల్లేడు, గన్నేరు, మారేడు దళాలతో పూజ చేయడం, “ఓం నమః శివాయ” మంత్రాన్ని 108 సార్లు జపించడం, విభూతి ధరించడం, నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పుకోవడం శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం దీపారాధన చేసి ఉపవాసం పాటిస్తే శివుడి అనుగ్రహం మరింత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
అయితే ఈ రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. తులసి ఆకులతో శివుడిని పూజించకుండా మారేడు దళాలతో మాత్రమే పూజ చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ విశిష్టమైన రోజున భక్తితో శివారాధన చేస్తే సకల శుభాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.
