
D News: Jul 10: ఆధార్ కార్డు తర్వాత దేశంలో అత్యంత ముఖ్యమైన పత్రాల్లో పాన్ (PAN) కార్డు ఒకటి. ఇది కేవలం గుర్తింపు ధ్రువీకరణకే కాకుండా, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగంలో చేరడం, జీతం పొందడం, ఆదాయపు పన్ను (IT) రిటర్నులు దాఖలు చేయడం, బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తాల లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తు చేయడం వంటి అనేక సందర్భాల్లో పాన్ కార్డు తప్పనిసరిగా అవసరమవుతుంది. అందుకే ఫిజికల్ కార్డుతో పాటు మొబైల్‌లో దాని డిజిటల్ కాపీని కూడా భద్రంగా ఉంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
పాన్ కార్డుపై ఉండే 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ప్రతి కార్డుదారుడికి ప్రత్యేకమైనది. ఇది కేవలం యాదృచ్ఛికంగా ఇచ్చిన సంఖ్య కాదని, ప్రతి అక్షరం, ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుందని చాలామందికి తెలియదు. ఈ కోడ్ ద్వారా కార్డు ఏ వర్గానికి చెందినది, అది అసలైనదా కాదా వంటి వివరాలను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది.
పాన్ నంబర్‌లో మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు ఏవైనా ఉండవచ్చు. వీటిని ఆదాయపు పన్ను శాఖ సిస్టమ్ ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది. నాలుగో అక్షరం మాత్రం కార్డుదారుడి కేటగిరీని సూచిస్తుంది. ‘P’ అంటే వ్యక్తిగత (Individual), ‘C’ అంటే కంపెనీ, ‘T’ అంటే ట్రస్ట్, ‘F’ అంటే భాగస్వామ్య సంస్థ (Firm), ‘L’ అంటే స్థానిక సంస్థ (Local Authority), ‘H’ అంటే హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), ‘A’ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (AOP), ‘G’ అంటే ప్రభుత్వ సంస్థ అని అర్థం.
పాన్ నంబర్‌లో ఐదో అక్షరం కూడా ఎంతో ముఖ్యమైనది. వ్యక్తిగత పాన్ కార్డుల విషయంలో అది కార్డుదారుడి ఇంటి పేరులోని తొలి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఇంటి పేరు ‘Nalla’ అయితే ఐదో అక్షరం ‘N’గా ఉంటుంది. ఒకవేళ ఆ అక్షరం ఇంటి పేరులోని మొదటి అక్షరంతో సరిపోలకపోతే, ఆ పాన్ కార్డు వివరాలను మరోసారి పరిశీలించడం మంచిది.
పాన్ నంబర్‌లో ఆరో నుంచి తొమ్మిదో స్థానాల వరకు ఉండే నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా కేటాయించబడతాయి. చివరి, అంటే పదో అక్షరం కూడా సిస్టమ్ రూపొందించే చెక్ క్యారెక్టర్ (Check Character). ఇది మొత్తం పాన్ నంబర్‌ను ధ్రువీకరించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా పాన్ నంబర్‌లోని ప్రతి అక్షరం, ప్రతి సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో కార్డుదారుడి గుర్తింపును నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
