
DNews:27 Apr: హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్ జలాశయం వద్ద సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు సరదాగా ఈత కొట్టాలని నిర్ణయించుకుని నీటిలోకి దిగారు. అయితే నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో వారు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ ప్రమాదంలో టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్ మరియు షాబాజ్ అనే ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
నీటిలో మునిగిపోతున్న సమయంలో ఒక యువకుడు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగలిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో నీటిలో నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన యువకుడిని వెంటనే చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ వార్త తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వేసవి కాలం కావడంతో జలాశయాల వద్దకు వెళ్లే యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
