
D Spiritual: Mar 18: ఇల్లు కట్టుకున్నప్పుడు, కొత్త షాప్ ప్రారంభించినప్పుడు లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాల ముందు చాలా ఇళ్ల వద్ద ఒకే దృశ్యం కనిపిస్తుంది. గుమ్మం వద్ద వేలాడుతూ కనిపించే బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ, మిర్చి దండలు తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. చెడు చూపు, ఈర్ష్య, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా అడ్డుకునే రక్షణ కవచంగా దీనిని భావిస్తారు. మూఢనమ్మకం అనిపించినా, ఈ ఆచారాన్ని ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు విశ్వాసంతో పాటిస్తున్నారు.
ఈ సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోని వ్యాపార సముదాయాలు, కొత్తగా ప్రారంభమయ్యే షోరూమ్‌లు, కార్యాలయాల వద్ద కూడా కనిపిస్తుంది. పెద్ద సైజులో గుండ్రంగా ఉండే గుమ్మడికాయను ఎంచుకుని, దానిపై భయానకంగా కనిపించే ముఖాన్ని గీస్తారు. కొన్ని చోట్ల పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, నల్ల దారంతో చుట్టి, నిమ్మకాయలు, పచ్చిమిర్చులతో అలంకరిస్తారు. ఈ రూపం చెడు దృష్టిని తనవైపు ఆకర్షించి, ఇంట్లోకి రాకుండా చేస్తుందని నమ్మకం.
ఇంటి ప్రధాన ద్వారం పైన గుమ్మడికాయను వేలాడదీయడం వెనుక బలమైన విశ్వాసం ఉంది. ఇంట్లోకి వచ్చే నరదిష్టి, కనుదిష్టి, ఈర్ష్య వంటి ప్రతికూల శక్తులను గుమ్మడికాయ తనలోకి తీసుకుని, వాటిని బయటే ఆపేస్తుందని అంటారు. అందుకే దీనిని నిర్లక్ష్యంగా కాకుండా కొన్ని నియమాలతో కట్టాలని పండితులు సూచిస్తారు.
చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గుమ్మడికాయను కడగడం. ఇంటి ముందు కట్టేముందు నీళ్లతో కడిగితే దానిలోని శక్తి తగ్గిపోతుందని నమ్మకం. అందుకే నేరుగా పసుపు, కుంకుమ పెట్టడం మంచిదని చెబుతారు. అలాగే మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తొడిమతో పట్టుకుని ఎక్కువగా తిప్పడం లేదా తొడిమ ఊడిపోయిన గుమ్మడికాయను కట్టడం కూడా శుభకరం కాదని అంటారు.
ఇంకో ముఖ్యమైన అంశం సమయం. చాలామంది తమకు అనుకూలంగా అనిపించినప్పుడు గుమ్మడికాయ కడతారు. కానీ సంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే కట్టడం ఉత్తమమని భావిస్తారు. ఒకవేళ అది సాధ్యంకాకపోతే బుధవారం లేదా శనివారం తెల్లవారుజామున కట్టవచ్చని సూచిస్తారు. సూర్యాస్తమయం తర్వాత కట్టితే ఫలితం ఉండదని పెద్దలు చెబుతుంటారు.
గుమ్మడికాయ చెడు శక్తులను గ్రహిస్తుందని నమ్మకం ఉన్నందున దాన్ని ఎక్కువ రోజులు అలాగే ఉంచరు. ప్రతి అమావాస్యకు ఒకసారి కొత్త గుమ్మడికాయను కట్టి, పాతదాన్ని ఇంటికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం కొనసాగుతుందని విశ్వాసం.
వాస్తు శాస్త్రంలో దీనిపై ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా, ఇది బలమైన సాంస్కృతిక, జానపద ఆచారంగా గుర్తింపు పొందింది. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, చాలామందికి ఇది మానసిక భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చివరికి విశ్వాసమే బలం అయితే, ఈ సంప్రదాయం కూడా జీవితంలో ప్రశాంతతను తీసుకువస్తుందన్నదే అనేకమంది నమ్మకం.
