
DNews:18 Mar: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతితో క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్లే సకాలంలో చికిత్స అందక తేజస్విని ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ఇన్-ఛార్జ్ వైస్ ఛాన్సలర్ (VC) ప్రొఫెసర్ గోవర్ధన్ నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆయన గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. అధికారుల బుజ్జగింపులను తిరస్కరించిన విద్యార్థులు, రాత్రంతా గెస్ట్‌హౌస్ గేటు ముందే నిద్రించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, క్యాంపస్‌లో అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థుల భద్రత కంటే తమ స్వలాభం కోసం ప్రాధాన్యత ఇస్తున్న అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు భారీగా క్యాంపస్‌కు చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. గతంలోనూ మెస్ కాంట్రాక్టులు, కనీస వసతులపై ఆందోళనలు జరిగినప్పటికీ, తాజా విద్యార్థిని మరణం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
