
D Spiritual: Mar 14: హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని బి. ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల కార్యకలాపాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. వేద విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ గూడ శ్రీనివాస శర్మ, అధ్యాపకులు, ఇంజనీరింగ్ అధికారులు, డీఈ రామకృష్ణ, జేఈ చలమా నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
