
D Spiritual: Mar 14: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తుల సౌకర్యం కోసం ఆధునిక డిజిటల్ సేవలను ప్రవేశపెట్టారు ఆలయ అధికారులు. దర్శనాలు, సేవల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితికి ముగింపు పలుకుతూ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యంత్రాల ద్వారా భక్తులు తమ మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అవసరమైన ఆలయ టికెట్లను సులభంగా పొందవచ్చు.
సింహాచలం ఆలయంలో అన్ని డిజిటల్ సేవలను సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల రూపంలో ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది యంత్రాలను కొండపైన బస్టాండ్, వీఆర్‌ఓ కార్యాలయం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందే సౌకర్యాన్ని కల్పించారు. దర్శనాలు లేదా సేవల కోసం వచ్చే భక్తులు కియోస్క్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపుతో టికెట్లు పొందవచ్చు.
వివిధ రకాల దర్శన టికెట్లతో పాటు ఆలయ సేవల టికెట్లు కూడా ఈ యంత్రాల ద్వారా పొందే అవకాశం ఉంది. టికెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో దర్శన, సేవ టికెట్లు పొందేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సమయాన్ని ఆదా చేస్తూ ఒత్తిడి లేకుండా దర్శనం కల్పించడమే దేవస్థానం లక్ష్యమని ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని వినూత్న డిజిటల్ సేవలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ఈ కియోస్క్‌ల ద్వారా కేవలం దర్శనాలు, సేవల టికెట్లు మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో హుండీ కానుకలు సమర్పించే సదుపాయాన్ని కూడా కల్పించారు. భవిష్యత్తులో ఇతర ఆర్థిక సేవలు, అన్నదానం విరాళాలు వంటి సేవలను కూడా పూర్తిగా డిజిటల్ విధానాల్లోకి మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
