
D Spiritual: Mar 13: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన కీలక పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టు గుర్తుచేసింది.
ఏదైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకు తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. గతంలో రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సీబీఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ పేర్కొనగా, దర్యాప్తు సంస్థ తన విధి ప్రకారం పని చేస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.
