
DNews: Mar 07: హైదరాబాద్‌లో లాలాపేట్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాములో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ జరుగుతోందని సమాచారం ఆధారంగా సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు లాలాగూడ పోలీస్ సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ‘జానీ జింజర్ గార్లిక్ పేస్ట్’ పేరుతో తయారీ జరుగుతున్న గోదాములో అత్యంత అస్వచ్ఛమైన పరిస్థితుల్లో ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు బయటపడింది. నిల్వ ఎక్కువకాలం ఉండేందుకు, రంగు మారకుండా ఉండేందుకు నిందితులు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో సుమారు 1,915 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 30 కిలోల అసిటిక్ యాసిడ్, తయారీ యంత్రాలు, ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీలా వెంకటేశ్వర్లు సహా నలుగురిని అరెస్టు చేసి లాలాగూడ పోలీసులకు అప్పగించారు. నకిలీ బ్రాండ్ లేబుళ్లతో ప్యాకింగ్ చేసి నగరంలోని అనేక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ చర్యతో నగర ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే పెద్ద గ్యాంగ్‌ను పోలీసులు బస్టు చేశారు.
