
DNews:20 Feb: హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా మరియు మురుగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన ‘బస్తీబాట’ కార్యక్రమం నేడు శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా జలమండలి అధికారులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించనున్నారు. ప్రతి వారం మంగళ, బుధ, శుక్ర మరియు శనివారాల్లో ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డితో సహా వార్డు స్థాయి మేనేజర్ల వరకు అందరూ బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తారు. క్షేత్రస్థాయి పర్యటనలు ముగిసిన తర్వాత అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుండి తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి సాధారణ విధులను నిర్వహిస్తారు.
ఈ పర్యటనల్లో భాగంగా తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న తక్కువ పీడనం, పైప్‌లైన్ లీకేజీలు, కలుషిత నీటి సరఫరా మరియు అక్రమ మోటార్ల వాడకం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. అలాగే మురుగునీటి సమస్యలైన మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడం, పూడికతీత పనులు మరియు లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వార్డుల వారీగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భూగర్భ జలమట్టాల పెంపునకు అవసరమైన ఇంకుడు గుంటల నిర్మాణంపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. పర్యటనల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి శనివారం వారంతపు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
