
DNews: Feb 19: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తేదీని ఖరారు చేశారు. ఆమె తెలిపిన ప్రకారం మే మొదటి వారంలో శుభదినం చూసి అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ పేరులో తప్పనిసరిగా “తెలంగాణ” అనే పదం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని, తన మొదటి ఎంపిక సిద్ధిపేట, రెండవ ఎంపిక బోధన్ అని వెల్లడించారు.
కవిత మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఉండదని, తానే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తానని ధైర్యంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యల కోసం పోరాడతానని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంసీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాజకీయాలు చేయకుండా బీఆర్ఎస్ మార్గాన్నే అనుసరిస్తోందని విమర్శించారు. పార్టీ వ్యక్తులపై ఆధారపడకుండా వ్యవస్థలపై నడవాలని, సిద్ధాంతపరమైన పునాది ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళలను అవమానించకూడదని కవిత స్పష్టం చేశారు. వైఎస్ శర్మిల ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నా, తెలంగాణలో ప్రజలు ఆమె పార్టీని అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. చిరంజీవి కూడా పార్టీని ఏర్పాటు చేసి మూసివేశారని గుర్తుచేశారు. “నేను నా మార్గంలో వెళ్తున్నాను.. నా ప్రయత్నం నాది” అని ఆమె అన్నారు. తన పార్టీ తొలి పంక్తి తెలంగాణ సమస్యేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు దిగువ స్థాయి నాయకులు కూడా కేంద్ర మంత్రులయ్యారని ఉదాహరణ ఇచ్చారు.
తన పార్టీ ద్వారా కొత్త తరం నాయకులకు అవకాశాలు కల్పిస్తానని కవిత హామీ ఇచ్చారు.
