
DSports 14Feb 2026:జైపూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని సీజన్లుగా జట్టుకు వెన్నెముకగా నిలిచిన సంజూ శాంసన్ స్థానంలో, యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13 (శుక్రవారం) సాయంత్రం ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధృవీకరించింది.
- గత నాలుగు సీజన్లుగా కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్, ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి వెళ్లారు. దీంతో రాజస్థాన్ యాజమాన్యం కొత్త నాయకుడి అన్వేషణలో పరాగ్ వైపు మొగ్గు చూపింది.జట్టులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీ రియాన్ పరాగ్ నాయకత్వ సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేసింది.23 ఏళ్ల వయసులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రియాన్ పరాగ్, రాజస్థాన్ రాయల్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పరాగ్ ఎంపికను సమర్థిస్తూ, అతనిలో ఒత్తిడిని ఎదుర్కొనే గుణం మరియు క్రికెట్ పట్ల ఉన్న లోతైన అవగాహన జట్టుకు ప్లస్ అవుతుందని పేర్కొన్నారు.
- రియాన్ పరాగ్ 2019 నుంచి రాజస్థాన్ రాయల్స్‌లో అంతర్భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు 84 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడి 1,566 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2024 సీజన్‌లో 573 పరుగులు చేసి తన సత్తా చాటాడు. గత సీజన్ (2025)లో సంజూ శాంసన్ గాయపడిన సమయంలో 8 మ్యాచ్‌లకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా పరాగ్‌కు ఉంది.
