
DNews:06 Feb: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం అలియాబాద్ మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లాల్‌గడీ మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తుండగా, డీజే సౌండ్ ఎక్కువగా ఉందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సౌండ్ తగ్గించాలని కోరినందుకు ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభ్యర్థి అనుచరులు బీఆర్ఎస్ శ్రేణులపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన పరమేష్‌తో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డిని కూడా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మల్లారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికల వేళ ఇలాంటి దాడులు జరగడం పట్ల స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
