
D Spiritual: Jan 24: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా (TG) గుర్తింపు పొందిన మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. లక్షలాదిగా భక్తులు గిరిజన దేవతలను దర్శించుకునేందుకు మేడారానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం మహా జాతర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
మేడారం మహా జాతర కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో పాటు గిరిజన వ్యవహారాల శాఖలు సంయుక్తంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేశాయి. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ నిధులు మంజూరు అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిసింది. మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం ఈ నిధులు ఉపయోగించనున్నట్లు సమాచారం.
ఇదే కాకుండా గతంలో కూడా కేంద్ర పర్యాటక శాఖ మేడారం మహా జాతరతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. మేడారంతో పాటు ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రూ. 80 కోట్ల నిధులు కేటాయించింది.
‘గిరిజన సర్క్యూట్’ పేరిట పర్యాటకులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు వినియోగిస్తున్నారు. అంతకుముందు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 140 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.
