
D NEWS: 22A Land Inquiry Committee ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ అనంతరం బాధ్యతలను నిర్ధారించి తదుపరి చర్యలకు సిఫార్సులు చేయనుంది.
కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేన చైర్‌పర్సన్‌గా, ఐఏఎస్ రాజీవ్ హనుమంతు కన్వీనర్‌గా, ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా సభ్యుడిగా నియమితులయ్యారు. సంబంధిత జిల్లాల అంశాలను పరిశీలించే సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం కోరిన సమాచారం, పత్రాలు, డేటా, రికార్డులు, మానవ వనరులను అందించాలని శాఖలను ఆదేశించింది.
సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లోని పలు భూములను కమిటీ పరిశీలించనుంది. ప్రభుత్వ, సీలింగ్ మిగులు, అసైన్డ్, జాగీర్, భూదాన్, ఇనాం, అటవీ భూములతో పాటు భూసేకరణ, పునరావాస భూములు, జలాశయాలు, క్యాచ్మెంట్ ప్రాంతాలు, భూ రికార్డులను కూడా విచారణ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఇక సిద్దిపేట జిల్లాలో వెలికట్ట అసైన్డ్ భూములు, మల్లన్నసాగర్ భూసేకరణ అంశాలు పరిశీలనకు రానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు లేదా అనుచరులకు సంబంధించినట్లు పేర్కొన్న భూముల అంశాలు, హైదరాబాద్‌లో లీజు భూముల క్రమబద్ధీకరణ, మహబూబ్‌నగర్‌లో ధరణి పోర్టల్‌కు సంబంధించిన ఆరోపణలు, రాజన్న సిరిసిల్లలో అసైన్డ్, ప్రభుత్వ భూముల కేటాయింపుల అంశాలను కూడా కమిటీ పరిశీలించనుంది. ఇవన్నీ విచారణలో నిర్ధారణ కావాల్సిన అంశాలుగా ప్రభుత్వం పరిశీలించనుంది.
22A Land Inquiry Committeeకు అవసరమైతే మధ్యంతర నివేదికలు సమర్పించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. తుది విచారణ అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దీంతో 22ఏ భూముల అంశంపై ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ చర్చకు తాజా ప్రభుత్వ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
