
DNews:20 Dec: మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు అప్రమత్తమయ్యారు. నార్కొటిక్స్ బ్యూరోతో పాటు హైదరాబాద్ పోలీసులు నగరవ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్రగ్స్ కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న కేఫిటేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మేనేజర్ ఆసిఫ్ వద్ద నుంచి ఎమ్డీఎమ్ఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రాథమిక విచారణలో గత కొంతకాలంగా ఆసిఫ్ వ్యక్తిగతంగానే డ్రగ్స్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి సేవిస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఎమ్డీఎమ్ఏ డ్రగ్ ఆసిఫ్‌కు ఎవరి ద్వారా సరఫరా అవుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించడమే లక్ష్యంగా పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.నూతన సంవత్సరం వేడుకల సమయంలో ప్రతీ ఏడాది Hyderabadలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఈసారి ఎక్కడా కూడా డ్రగ్స్ మాట వినిపించకూడదనే ఉద్దేశంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ కేసు బయటపడినట్లు తెలుస్తోంది.
ఆసిఫ్ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఆస్పత్రుల్లో భద్రత, పర్యవేక్షణపై మరోసారి చర్చ మొదలైంది. డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు మరింత కఠినంగా ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
