
DNews:20 Dec: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబసభ్యులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల గెలిచిన అభ్యర్థులపై దాడులు జరగగా, తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓటమిపై ఫ్రస్టేషన్‌తో కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబసభ్యులు ఏకంగా ఎడ్లబండిని అడ్డంపెట్టి రోడ్డును మూసివేసి, పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులపైనే దాడి చేయడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి చంద్రకళపై బీఆర్ఎస్ అభ్యర్థి ఉజ్వల్ యాదవ్ గెలుపొందాడు. ఈ ఫలితాన్ని చంద్రకళ భర్తతో పాటు కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. తమను ఓడించిన గ్రామస్తులపై కక్షతో, తమ ఇంటి ముందు రహదారిపై ఎడ్లబండిని అడ్డంగా పెట్టి రోడ్డును పూర్తిగా మూసివేశారు. అటువైపు నుంచి ఎవరూ వెళ్లకూడదని వారు అడ్డుపడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్ చేసేందుకు ఎడ్లబండిని పక్కకు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చంద్రకళ కుటుంబసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ, చివరకు దాడికి తెగబడ్డారు. ఓ కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేయగా, ఈ ఘటనలో ఎస్సైతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల ఓటమిని అంగీకరించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీ ఏదైనా సరే, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో Indian National Congress స్థానిక నేతల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
