
D Spiritual: Dec 6: వైకుంఠ ఏకాదశి 2025: ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఏమి చేయాలి? ఏ నియమాలు పాటించాలి? ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి 2025లో డిసెంబర్ 30, మంగళవారం జరుపుకుంటారు. ఏకాదశి తిథి డిసెంబర్ 30 ఉదయం 7:51 నుంచి మొదలై, డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశి పర్వదినాన్ని నిర్ణయిస్తారు కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30న జరుపుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామున 3:30 గంటల నుంచి వైష్ణవాలయాలలో ద్వారదర్శనం ప్రారంభమవుతుందని చెబుతారు.
వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా పాటించవలసినది ఉపవాసం. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఈ రాత్రి జాగారం చాలా ముఖ్యమైంది. నారాయణ నామసంకీర్తనం, భజనాలు, భాగవత కథలు వింటూ రాత్రంతా జాగరణ ఉండటం వలన మోక్షఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
ఈ రోజున శ్రీమహావిష్ణువును అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. విష్ణువుకు ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, తులసి మాలను సమర్పించడం శుభప్రదం. పులిహోర, చక్రపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ అతిముఖ్యమైనది. ముఖ్యంగా వైకుంఠ ద్వారమైన ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి రోజున దానాలు చేయడం అత్యంత శ్రేయస్కరం. బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం పున్యఫలితాన్ని ఇస్తుంది. తులసి మొక్కను దానం చేయడం కూడా శుభప్రదం. ఈ రోజంతా “ఓం నమో నారాయణాయ నమః” లేదా “జై శ్రీమన్నారాయణ” మంత్రాలను ఎక్కువసార్లు జపించడం ఎంతో పుణ్యఫలదాయకమని పండితులు సూచిస్తున్నారు.
