
D Spiritual: Dec 5: రాత్రి సమయంలో బట్టలు నిజంగానే ఉతకకూడదా? ఉతికితే ఏం జరుగుతుంది? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో తెలుసుకోవడం అవసరం.
రాత్రిళ్లు కొన్ని పనులు చేయడం హిందూ సంప్రదాయంలో నిషేదంగా పరిగణించబడింది. వాటిలో బట్టలు ఉతకడం కూడా ఒకటి. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతల గమనం శాంతంగా మారుతుందని, ప్రతికూల శక్తుల ప్రవాహం పెరుగుతుందని నమ్మకం ఉంది. ఈ పరిస్థితుల్లో బట్టలు ఉతకడం ఇంటిపరిసరంలోని సాత్వికతకు, సానుకూల శక్తులకు ఆటంకం కలిగిస్తుందని కొందరు భావిస్తారు.
అదేవిధంగా, రాత్రి సమయంలో చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనస్సు మరియు నీటిని ప్రభావితం చేసే గ్రహంగా పరిగణించబడతాడు. అందువల్ల రాత్రి సమయంలో నీటికి సంబంధించిన పనులు ఎక్కువ చేస్తే మానసిక అస్థిరత, ఆందోళన, అనవసర ఒత్తిడులు రావచ్చని కొందరు నమ్ముతారు. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా, సంప్రదాయ నమ్మకాలలో భాగం. రాత్రి బట్టలు ఉతికితే లక్ష్మీదేవి కూడా అసంతృప్తి చెందుతారని, రాత్రి బట్టలు ఆరబెట్టడం కూడా అసురక్షితమని పాతనమ్మకాలు చెబుతాయి.
కొంతమంది మతపండితుల అభిప్రాయం ప్రకారం రాత్రి సమయంలో ఎక్కువగా నీటిని ఉపయోగించడం చంద్రదోషం కలిగించవచ్చని, రాహు–కేతువుల ప్రతికూల ప్రభావాలను పెంచవచ్చని అంటారు. రాత్రి బట్టలు ఉతకడం అశుభమని చాలామంది నిర్లక్ష్యం చేసినా, మతపరంగా ఈ నమ్మకానికి నేటికీ ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. అందువల్ల రాత్రి సమయంలో బట్టలు ఉతకకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
