
D Spiritual: Dec 4: సాధారణంగా హిందువులు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాలను కూడా ఎంతో విశ్వసిస్తారు. ఇంట్లో ఏ పని చేయాలన్నా వాస్తు ప్రకారమే చేయడమే కాకుండా, ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోవాలన్నా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించే సంప్రదాయం ఉంది.
ఈ క్రమంలోనే మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నా లేదా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా, కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం ద్వారా ఈ సమస్యలు దూరం అవుతాయని నమ్మకం ఉంది.
మన ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నా, నాగకేసరి పుష్పాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
నాగకేసరి పుష్పాన్ని ఎక్కడ పెట్టాలి అనే విషయానికి వస్తే—శుక్లపక్షం శుక్రవారం రాత్రి ఈ పుష్పాన్ని ఒక చిన్న బాక్సులో కొద్దిగా నెయ్యితో కలిసి వేసి దానిపై మూత పెట్టాలి. ఈ బాక్స్‌ను మనం డబ్బు దాచే చోట ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యం లభిస్తుందని చెబుతారు.
అలాగే, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పుష్పాలలో నాగకేసరి ఒకటి. సోమవారం ఈ పుష్పాలతో పరమేశ్వరుడిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం లభించి, ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం. పరమేశ్వరునికి కేసర పువ్వు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరటంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుందని నమ్మారు.
