
D Spiritual: Dec 3: హిందూ సంప్రదాయంలో వంటగది అంటే కేవలం ఆహారం తయారయ్యే స్థలం కాదు. అది అన్నపూర్ణ దేవి, లక్ష్మీ దేవి సంచారం చేసే పవిత్ర ఆలయంగా భావిస్తారు. అందుకే ఎంత సంపాదన ఉన్నా ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి వంటగదిలో అనుకోకుండా చేసే కొన్ని చిన్న తప్పులే కారణమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. నిత్య వంటలో కొన్ని నియమాలు పాటిస్తే ఐశ్వర్యం సహజంగానే ఇంట్లో నిలుస్తుందని విశ్వాసం.
వంట ప్రారంభించే ముందు శరీరం, మనస్సు శుభ్రంగా ఉండాలి అనేది ముఖ్యమైన నియమం. నిద్ర లేచిన వెంటనే వంట చేయడం కంటే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి వంట చేయడం ఆహారానికి పవిత్రతను అందిస్తుందని నమ్మకం. అలా తయారైన ఆహారం కుటుంబ ఆరోగ్యానికే కాదు, ఇంటి అదృష్టానికీ మూలమవుతుందని భావిస్తారు. వంటగది శుభ్రత కూడా అత్యంత ప్రధానమైన అంశం. గ్యాస్ పక్కన చిందిన పదార్థాలు, మూలల్లో పేరుకున్న దుమ్ము, ఎంగిలి వాసన వచ్చే పాత్రలు ఇవన్నీ లక్ష్మీ ప్రవేశానికి అడ్డంకులని పెద్దలు చెబుతారు. విరిగిన పాత్రలు, పాతబడిన వస్తువులు వంటగదిలో ఉండటం నెగటివ్ ఎనర్జీకి కారణమన్నది వారివి మాట.
వంట పూర్తయ్యాక మొదటి ముద్ద దేవుడికి నైవేద్యం పెట్టడం కేవలం ఆచారం మాత్రమే కాదు, ఇది ఇంట్లో ఐశ్వర్యాన్ని నిలబెట్టే శక్తివంతమైన చర్యగా భావిస్తారు. వంట ప్రారంభించే ముందు స్టవ్‌కు నమస్కారం చేయడం, అగ్నిని సాక్షిగా పూజించడం శుభాన్ని తెస్తుందని చెబుతారు. వంట సమయంలో కోపంగా మాట్లాడటం, గొడవలు పెట్టుకోవడం, నెగటివ్ మాటలు మాట్లాడటం ఇంటి వాతావరణానికే కాదు, ఆహార శక్తిపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్వాసం. ప్రశాంతంగా వంట చేసిన ఆహారం ఇంట్లో ఆనందం, శాంతిని పెంచుతుందని అనుభవాలు చెబుతున్నాయి.
రాత్రివేళ వంటగదిని నిర్లక్ష్యం చేయడం మరో పెద్ద తప్పు. ఎంగిలి పాత్రలను అలాగే వదిలేయడం, సింక్‌ను శుభ్రం చేయకపోవడం లక్ష్మీ దేవికి ఇష్టం ఉండదని పెద్దలు ఎప్పటినుండో చెబుతున్నారు. పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసి, ఒక చిన్న గిన్నెలో నీరు నింపి ఉంచితే ఇంటిలో సానుకూల శక్తి నిలుస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఆచరణలో కనిపించని ఈ చిన్న తప్పులే కొన్ని ఇళ్లలో డబ్బు నిలవకపోవడానికి అసలు కారణమని గుర్తుచేస్తున్నారు. శుభ్రత, శాంతి, భక్తి ఈ మూడు వంటగదిలో కలిసితే లక్ష్మీ దేవి కృప ఇంటిని విడిచిపెట్టదనే నమ్మకం మరింత బలపడుతోంది.
