
DNews:25 Nov:తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందిస్తున్న ముఖ్య ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’. ఈ దార్శనిక పత్రం రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిక్సూచి గా నిలుస్తోంది. ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, ప్రతి ప్రాంతానికీ సమాన అభివృద్ధి, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతిని సమీక్షిస్తూ, మరికొన్ని దశాబ్దాల్లో చేరుకోవలసిన లక్ష్యాలను నిర్ణయించేందుకు ఈ పత్రం రూపొందుతోంది. ముఖ్యంగా విద్య, వైద్యం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించి తెలంగాణను గ్లోబల్ స్కిల్ కేపిటల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.ఈ నెల 8–9 తేదీల్లో టెలంగానా ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఈ దార్శనిక పత్రం అమలుకై కీలక వేదిక కానుంది. తొలి రోజున సామాజిక రంగాలపై, రెండో రోజున పర్యావరణం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలపై అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. ప్రపంచ దేశాల రాయబారులు, పరిశ్రమల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం ఉండటం తెలంగాణకు అత్యంత అనుకూలం. ఈ సందర్భంగా సీఎం ఆధ్వర్యంలో విజన్ డాక్యుమెంట్ అధికారికంగా విడుదల కానుంది.
మూడు కోర్ జోన్ల అభివృద్ధి నమూనా
రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం మూడు కోర్ జోన్ల విభజనను ప్రతిపాదించింది.
1. అర్బన్ కోర్ – హైదరాబాద్ , హైదరాబాద్ నగరాన్ని డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రీ 4.0, స్టార్టప్ ఎకోసిస్టమ్, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల పరిశ్రమలు, ఇంజినీరింగ్ సేవలు, ఆధునిక మాన్యుఫ్యాక్చరింగ్‌తో నగరం మరింత అభివృద్ధి చెందనుంది.
2. సెమీ–అర్బన్ జోన్లు – జిల్లా కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో పర్యావరణానికి అనుగుణంగా ఉన్న ఎకో ఇండస్ట్రియల్ పార్కులు, నైపుణ్య కేంద్రాలు, యువతకు శిక్షణ అవకాశాలను విస్తరించనున్నాయి.
3. గ్రామీణ తెలంగాణ, గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం, పశుసంవర్ధక, చేపల పెంపకం, అడవి వనరుల ఆధారిత జీవనోపాధిని బలోపేతం చేయనున్నారు. అలాగే హ్యాండ్లూమ్–హ్యాండీక్రాఫ్ట్ రంగాలకు విశేష ప్రోత్సాహం, గ్రామీణ పర్యాటక అభివృద్ధి కూడా ముఖ్య భాగం.
సస్టైనబుల్ పాలసీలు, పెట్టుబడుల ఆకర్షణ
లో-కార్బన్ ఇండస్ట్రీలు, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు – ఇవన్నీ తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చే లక్ష్యం. వ్యవసాయ రంగంలో మార్కెట్ యాక్సెస్ పెంపు, పంట వైవిధ్యం, అగ్రిటెక్ వినియోగం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే స్పష్టమైన దృష్టి ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
2047 ప్రధాన లక్ష్యం
ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా, గౌరవప్రదంగా, భద్రతతో కూడిన జీవితం గడపాలి – ఇదే ఈ దార్శనిక పత్రం తుద లక్ష్యం. విద్య, ఆరోగ్యం, పోషణ, సంక్షేమ రంగాల సమన్వయంతో ప్రజల జీవన ప్రమాణాలను ప్రపంచ స్థాయికి చేర్చాలనే దీర్ఘకాల దృష్టి తెలంగాణ రైజింగ్ విజన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
