
D Spiritual: Nov 11: ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ఆలయం వెనుకగా భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు, ఆ సమయంలో చాలామంది గుడి వెనుక భాగాన్ని మొక్కుకోవడం గమనించవచ్చు. ఇది కేవలం ఒక్క ఆలయంలోనే కాదు, ప్రతి దేవాలయంలోనూ భక్తులు ఆచరించే విధానమే. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని జ్యోతిష్యులు వివరిస్తున్నారు.
ఆలయంలో మూలవిరాట్టు ఉండే గర్భాలయం అత్యంత పవిత్రమైనది. మూలవిరాట్టును వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. నిత్య పూజలు, మంత్రార్చనల వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో విగ్రహానికి ఒక ఆకర్షణ ఏర్పడి, ఆ మంత్రశక్తి వల్లే భగవత్ విగ్రహం నుండి తపః కిరణాలు నాలుగు దిక్కులకూ ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తికి అత్యంత దగ్గరగా, అధికంగా శక్తిని నిల్వ చేసుకునే భాగం గర్భాలయం వెనుక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు, తద్వారా భక్తులు అక్కడ ఆగినప్పుడు ఆ తపశ్శక్తిని పొందడానికి వీలుంటుంది.
ఈ కారణంతోనే భక్తులు గుడి వెనుక భాగాన్ని మొక్కుకుంటారు. దీనికి ఉదాహరణగా, శ్రీశైలంలో భ్రమరాంబిక దేవాలయం వెనుక భాగంలో ‘ఝుం’ అనే నాదం వినిపిస్తుంది, దీనిని భక్తులు భ్రమరీ నాదంగా భావిస్తారు. ఈ విధంగా గుడి వెనుక భాగంలో భగవత్ శక్తికి సంబంధించిన అనేక విశేషాలు, రహస్యాలు దాగి ఉంటాయి.
