
DNews:11 NOV:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ప్రారంభం ఆలస్యమైంది. సమస్యలను అధికారులు పరిష్కరించడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.
ఉదయం 9.30 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం: 10.2%
పోలింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వేగం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేతల ఓటు హక్కు వినియోగం
- బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్‌లో తన ఓటు హక్కును వినియోగించారు. ప్రజలందరూ ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
- దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి షేక్‌పేటలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
అవకతవకల ఆరోపణలు
జూబ్లీహిల్స్‌లో ఎన్నికల సందర్భంగా రాజకీయ వేడిగాలి దర్శనమిచ్చింది.
- కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
- రహమత్‌నగర్ ఎస్డీపీ హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ అనుచరులతో హల్చల్ చేసినట్టు సమాచారం.
- మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం చలాయించినట్లు ఆరోపించారు.
- వెంగళరావునగర్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త మట్టా దయానంద్ తిరుగుతున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
- పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుండటంతో ఎన్నికల వాతావరణం ఇంకా వేడెక్కే అవకాశం ఉంది.
