D Spiritual: Sep 12: తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల పర్వం.

బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి. అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.

తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటివాటిలో బొడ్డెమ్మ ఒకటి. బోనాలు, బతుకమ్మ పండుగలు ఎంత విశిష్టమైనవో.. బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధన్యత ఉంది. అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు. బొట్టె, బొడ్డె అంటే చిన్న అని. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు. ఇది కూడా మట్టి, పూలతో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఆదివారం నుంచి బొడ్డెమ్మను చేస్తున్నారు. 

బొడ్డెమ్మ అంటే..

బొడ్డెమ్మ అంటే ధాన్యరాశి, ధాన్యపు కుప్ప అని వాడుకలో ఉంది. బొడ్డెమ్మను పుట్ట మట్టితో అందంగా పేర్చి చెక్కపీటపై చతురస్రాకారంగా ఐదు దొంతరలుగా పేర్చి ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. బొడ్డెమ్మను ఉద్రాక్ష, కాకర, కట్ల, బీర, మళ్లి, జాజిపూలతో అలంకరిస్తారు. ఆ తర్వాత శిఖర ప్రదేశాన బియ్యంతో నిండిన చిన్న కలశం, కొత్త వస్త్రం పెడతారు. తమలపాకు, పసుపు గౌరమ్మను ఉంచుతారు.

సాయంకాలం ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి ఒక్కోవాడకు ఒక్కరి చొప్పున అన్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో బొడ్డెమ్మను నిలుపుతారు. ఇరుగు పొరుగు వారు, కన్నెపిల్లలు వచ్చి చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ పాటల మాదిరిగా బొడ్డెమ్మా.. బొడ్డెమ్మా వలలో.. బిడ్డాలెందరో వలలో అంటూ పాటలు కూడా ప్రత్యేకంగా పాడుకుంటారు. తొమ్మిది రోజులపాటు బొడ్డెమ్మను ఆడుకొని అమావాస్యకు ముందురోజు నీటిలో నిద్రబుచ్చి నిమజ్జనం చేయడం ఆనవాయితీ.

తొమ్మిది రోజులు.. ఆటపాటలు

తొమ్మిది రోజులు ఆటపాటల అనంతరం బొడ్డెమ్మను అందంగా అలంకరించి రాగి చెంబులో పోసిన బియ్యం, పప్పు, బెల్లం దినుసులను నైవేద్యంగా తయారు చేసి అందరికి ప్రసాదంగా పంచి చెరువులు, కుంటలు, బావుల్లో గాని బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మ నిమజ్జనం ముగిసిన మరుసటి రోజు నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది.

బొడ్డెమ్మను ఎలా చేస్తారంటే.. 

బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్లి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తారు. ఆపైన ఒక చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు. ప్రతి రోజు అనగా తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి.. బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా తొమ్మిది రోజులు చేస్తారు. దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు చేస్తారు. 

సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి వస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడతారు. పూజలో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బొడ్డమ్మ చుట్టూ చేరి.. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. అవి ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మ… నిద్రపోమ్మా. నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు.

పేర్లు వేరైనా.. అమ్మ ఒక్కతే.. 

బొడ్డెమ్మను.. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను పీటపై చేసి కొందరు పందిరి వేస్తారు. తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరిరోజు.. బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు. అనంతరం అమ్మాయిలకు తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను చేసి.. పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజించి.. పాటలు పాడి ఆడిన తర్వాత చెరువులో పోయిరా బొడ్డెమ్మ.. అంటూ నిమజ్జనం పూర్తి చేస్తారు. 

మరుసటి రోజు నుంచే బతుకమ్మ..

బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. దానిని కూడా తొమ్మిదిరోజులు చేస్తారు. ఇది ముగిసే సరికి దసరా వస్తుంది. ఇలా దాదాపు ఇరవై రోజులకు పైగా పండుగ వాతావరణం ఉంటుంది. ఆడవారు ఈ మూడు పండుగల్లో గౌరి దేవిని కామన్​గా పూజిస్తారు. కానీ వివిధ పేర్లతో కొలుచుకుంటారంతే..

ఉమ్మడి జిల్లాలో..

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బొడ్డెమ్మల సాంస్కృతిక పర్వం ప్రారంభమైంది. హనుమకొండ రాగన్న దర్వాజలో కూడా ప్రతియేటా ఆనవాయితీగా మాదిరిగా రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డెమ్మల వేడుకకు శ్రీకారం చుట్టారు. నగరాల్లోనూ అనేక చోట్ల బొడ్డెమ్మలకు శ్రీకారం చుట్టారు. ప్రాచీన సంస్కృతికి నిదర్శనంగా ఈ వేడుకలు జరుపుకోవడం తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకం. అందునా ప్రత్యేకించి వరంగల్ జిల్లా బతుకమ్మ, బొడ్డెమ్మ ఆటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండడం విశేషం.

ప్రాచీన పండుగకు ప్రభుత్వ ఆదరణేది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రాచీన పండుగలకు గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం బొడ్డెమ్మ పండుగను గుర్తించకపోవడం వలన పల్లెల్లో పండుగ ప్రాబల్యం తగ్గిపోతోంది. శాస్త్రీయంగా సైన్స్ పరంగా జరుపుకునే వేడుకల్లో బొడ్డెమ్మ ఒకటి. బొడ్డెమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రోత్సహించాలని ప్రజలు కోరుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana