D Spiritual: Nov 8: ఆంజనేయ పూజ – శని నుండి ఉపశమనం

శనివారం ఆంజనేయుని ఆరాధిస్తే సకల శనిదోషాలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శనిదేవుడే ఆంజనేయునికి ఈ వరం ఇచ్చాడంట! ముఖ్యంగా జాతకం ప్రకారం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దశలు జరుగుతున్న వారు శనివారం ఆంజనేయుని ఇష్టమైన వాటితో పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. మరి ఆంజనేయునికి ప్రీతికరమైనవి ఏవి? వేటితో పూజిస్తే హనుమ అనుగ్రహం సులభంగా లభిస్తుంది? ఈ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంజనేయునికి ప్రీతికరమైనవి ఇవే

ఆంజనేయునికి తమలపాకులు, సింధూరం, అరటిపండ్లు, వడమాల అంటే ఎంతో ప్రీతికరం. వీటిలో ప్రతీ దానికి ప్రత్యేకమైన పురాణ నేపథ్యం ఉంది.

ఆంజనేయునికి ఆకు పూజ అంటే ఎందుకు ఇష్టం?

సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి శ్రీరాములవారి దగ్గరకు బయలుదేరాడు. హనుమంతుని రాక కోసం వానరులు సముద్రతీరంలో ఎదురుచూస్తున్నారు. సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి వచ్చిన హనుమంతునికి ఆనందంతో వానరులు నాగవల్లి ఆకులతో దండలు వేసి స్వాగతం చేశారు.

ఆ రోజు నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి. తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల ఆయన ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని విశ్వాసం. అందుకే తమలపాకులతో హనుమను పూజిస్తే సకల అభీష్టాలు సిద్ధిస్తాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

సింధూర పూజతో విశేష ఫలితం

హనుమ లంకలో సీతమ్మను దర్శించినప్పుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుండటం చూసి కారణం అడిగాడు. అప్పుడు సీతమ్మ “శ్రీరాముని క్షేమం కోసం ధరిస్తాను” అంది. అప్పుడు హనుమ “సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాను” అని ఒళ్ళంతా సింధూరంతో అలంకరించుకున్నాడట.

అందుకే హనుమ పూజలో సింధూరం ప్రధానమైనది. స్వచ్ఛమైన సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి స్వామి విగ్రహానికి అలంకరిస్తే దుష్ట గ్రహ పీడలు, శత్రు బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం.

హనుమకు అరటి పండ్లు ఎందుకు సమర్పించాలి

శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో హనుమ గంధమాదన పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేస్తున్నాడు. అప్పుడే శ్రీరాముడు “నీకు ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక్క పండునూ తినకుండా తపస్సు చేస్తున్నావు కాబట్టి, నీకు అరటిపండ్లు సమర్పించినవారికి నా అనుగ్రహం కూడా లభిస్తుంది” అని వరం ఇచ్చాడు.

అందుకే హనుమకు అరటిపండ్లు సమర్పిస్తే ఆయనతో పాటు శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం.

వడమాల సమర్పణ వెనుక రహస్యం

ఆంజనేయ ఆలయాలలో భక్తులు వడమాలలు సమర్పిస్తారు. హనుమకు వడమాల సమర్పించడానికి శనివారం అత్యంత శ్రేష్ఠమైన రోజు. ఒకసారి హనుమ శనిదేవుని రాక్షసుల బారి నుండి రక్షించాడట. అప్పుడే శనిదేవుడు హనుమను ఆశీర్వదించి, “నిన్ను కొలిచిన వారికి శని బాధలు ఉండవు” అని వరమిచ్చాడు.

శనిదేవునికి మినుములు ప్రీతిపాత్రమైనవి. అందుకే మినుములతో చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పిస్తే శనిగ్రహ దోషాలు తొలగుతాయని విశ్వాసం.

అసాధ్యాన్ని సాధ్యం చేసే శ్లోకం

జీవితంలో క్లిష్ట సమయాల్లో అసాధ్యమై అనిపించే కార్యాలు సాధ్యం కావాలంటే ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం చదవాలి —
“అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వధ రామదూతం కృపాసింధుమ్ మత్కార్యం సాధయ ప్రభో!”

ఈ శ్లోకం హనుముని దయను పొందే అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు.
జై శ్రీరామ్! 🙏