
D Spiritual: Nov 4: ఉసిరికాయ తినడం మంచిదే, కానీ కొన్ని సమయాల్లో తింటే అనారోగ్య సమస్యలు, కొన్ని దోషాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. మరి ఉసిరికాయను ఎలాంటి సమయాల్లో తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఉసిరి వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఉసిరికాయ కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కార్తీకమాసంలో ఉసిరి చెట్టును ప్రత్యేకంగా పూజించడం, ఉసిరి దీపాలను వెలిగించడం, ఉసిరి దీపాలను దానం చేయడం వంటి ఆచారాలు విస్తృతంగా జరుగుతాయి. వీటివల్ల ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఉంది.
అయితే ఉసిరికాయను తినడం మంచిదే కానీ కొన్ని సమయాల్లో తినడం మంచిది కాదు అని పెద్దలు చెబుతారు. ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఆదివారం రోజున మరియు రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదని చెప్పేవారు. అయితే ఎందుకు తినకూడదన్న విషయం వారికి స్పష్టంగా తెలియకపోయినా, దానికి ఉన్న శాస్త్రీయ కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల అజీర్తి, గుండె మంట వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే రాత్రివేళ ఉసిరిని తినకూడదని చెబుతారు.
అలాగే ఉసిరికాయ శరీరానికి శక్తిని ఉత్పత్తి చేసే గుణం కలిగి ఉంది. రాత్రిపూట దాన్ని తింటే శరీరంలో శక్తి స్థాయి పెరిగి, నిద్ర సరిగా పట్టకపోవచ్చు. రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో విశ్రాంతి లోపించి ఇబ్బందులు కలుగుతాయి.
ఇంకా ఉసిరికాయకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది — ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుందట. సూర్యుడికి ఇష్టమైన రోజైన ఆదివారం నాడు, ఉసిరిలోని ఆ శక్తి మరింత బలంగా పనిచేస్తుందని నమ్మకం. అందువల్ల ఆ రోజున ఉసిరిని దూరంగా ఉంచుతారు.
అలాగే ఆదివారం రోజు, రాత్రింబగళ్ళు లేదా సప్తమి నాడు పగటిపూట ఉసిరిక పచ్చడి తింటే అలక్ష్మీ దోషం కలుగుతుందని పురాణ నమ్మకం ఉంది. అందుకే ఈ రోజుల్లో ఉసిరిని తినకూడదని పెద్దలు సూచించారు.
