
D Spiritual: Nov 2: సాధారణంగా ప్రతీ ఇంట్లో పూజగది ఉంటుంది. ఈ పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తారు. స్నానం చేయకుండా పూజ గదిలోకి అడుగు కూడా పెట్టరు. ఇలా ఎంతో పవిత్రంగా భావించి పూజ గదిలో దేవుడి విగ్రహాలు, ఫోటోలు ఉంచి పూజించడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే చాలామంది తెలిసి తెలియక పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను ఉంచుతూ ఉంటారు. ఈ వస్తువుల వల్ల ఆ ఇంట్లో సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎంతో పవిత్రంగా భావించే పూజ గదిలో ఏ వస్తువులను ఉంచుకోవాలి? ఏ వస్తువులను ఉంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా పూజ గదిలో దేవుడి విగ్రహాలను, దేవుడి ఫోటోలను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి కుటుంబ సభ్యులు అందరూ సుఖసంతోషాలతో ఉంటారని ప్రజల విశ్వాసం. అయితే కొంతమంది వారికి తెలియకుండా ఇంట్లో ఎక్కువ సంఖ్యలో దేవుడి విగ్రహాలు ఉంచి పూజిస్తారు. కానీ ఒకటికన్నా ఎక్కువ దేవుడి విగ్రహాలు పూజగదిలో పెట్టి పూజించడం మంచిది కాదని మత గ్రంథాలలో పేర్కొనబడింది.
అలాగే పూజ గదిలో దేవుడు ఫోటోలను ఉంచి పూజిస్తుంటారు. అయితే దేవుళ్లు ముగ్గురు రూపంలో ఉన్న ఫోటోలు కాకుండా, సౌమ్యంగా ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచి పూజించాలి. భయానక రూపాలు లేదా యుద్ధరూపంలో ఉన్న చిత్రాలు పూజగదిలో ఉంచడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతత దెబ్బతింటుందని అంటారు.
అంతేకాకుండా చాలామంది దేవుడి గదిలో పగిలిన దేవుడి ఫోటోలను, విరిగిపోయిన విగ్రహాలను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలా విరిగిపోయిన విగ్రహాలను లేదా పగిలిన ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజించడం వలన ఆ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల అలా విరిగిపోయిన దేవుడి విగ్రహాలను ఏదైనా గుడిలో కానీ చెట్టు కింద కానీ గౌరవంగా ఉంచాలి.
అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులను దేవుడితో సమానంగా భావించి కొంతమంది వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచి ఆ ఫోటోలకు పూజ చేస్తూ ఉంటారు. ఇలా దేవుళ్ల ఫోటోలతో సమానంగా చనిపోయిన వారి ఫోటోలకు పూజ చేయడం వల్ల అరిష్టం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చనిపోయిన వారి ఫోటోలను వేరుగా పితృదేవతల స్థలంలో ఉంచి పూజించడం శ్రేయస్కరం.
