
D Spiritual: Nov 2: 🙏 నిరాయ్ మాత ఆలయం – ఛత్తీస్‌గఢ్
భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని ఆలయాలు నిత్యం పూజలు, అభిషేకాలు జరుపుతూ 24 గంటలు భక్తులకు దర్శనం కల్పిస్తాయి. అయితే, మరికొన్ని ఆలయాలు మాత్రం ఏడాదికి ఒకసారి లేదా కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చేలా తెరుచుకుంటాయి. ఈ విధంగా ఏడాదిలో కేవలం కొన్ని గంటలు మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే అమ్మవారి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్‌లోని గారియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై నిరాయ్ మాత ఆలయం ఉంది. ఈ దేవాలయం ఏడాదిలో ఒకరోజు మాత్రమే తెరిచి, కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తుంది. ప్రత్యేకంగా చైత్ర నవరాత్రి అంటే ఉగాది పండుగ ఉత్సవాల సమయంలో, తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. ఈ కొద్ది సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు.
ఈ ఆలయంలో మరో ముఖ్యమైన ఆచారం ఏంటంటే – ఇక్కడ కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మహిళలకు ఎలాంటి ప్రవేశం ఉండదు. అలాగే, ఈ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి అభిషేకాలు ఉండవు; కేవలం కొబ్బరికాయ కొట్టి, ధూపం వేస్తే ఇక్కడ పూజ చేసినట్టే. అంతేకాకుండా, మహిళలకు ఆలయంలోకి ప్రవేశం మాత్రమే కాదు, స్వామివారి ప్రసాదాన్ని కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా స్వామివారి ప్రసాదం ఎవరైనా తీసుకుంటే వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అందుకే మహిళలు అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని కానీ, అమ్మవారి దర్శనం కోసం కానీ వెళ్లరు.
