
REDMI 17 and REDMI 17 5G Launched: షావోమీ (Xiaomi) తన రెడ్‌మీ సిరీస్‌లో తాజాగా REDMI 17, REDMI 17 5G స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇటీవలే భారత్‌లో REDMI Note 17ను తీసుకొచ్చిన సంస్థ.. ఇప్పుడు ఈ రెండు కొత్త మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 7500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP AI కెమెరా, ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 వంటి ఆకట్టుకునే ఫీచర్లు వీటిలో ఉన్నాయి.
6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే
REDMI 17, REDMI 17 5G రెండు మోడళ్లలోనూ 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను అమర్చారు. ఇది 120Hz AdaptiveSync రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 825 నిట్స్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. డిస్‌ప్లేకు Corning Gorilla Glass 7i రక్షణ కల్పించారు. అలాగే IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
ట్రిపుల్ TÜV Rheinland సర్టిఫికేషన్, DC డిమ్మింగ్, Wet Touch టెక్నాలజీ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వెనుక భాగంలో డైనమిక్ RGB లైట్‌ను అందించారు. కాల్స్, ఛార్జింగ్, గేమింగ్, యాప్ నోటిఫికేషన్ల సమయంలో ఈ లైట్ ప్రత్యేక ఎఫెక్ట్‌లను ప్రదర్శిస్తుంది.
రెండు ఫోన్లలో వేర్వేరు ప్రాసెసర్లు
REDMI 17లో MediaTek Helio G91 Ultra ప్రాసెసర్‌ను ఉపయోగించగా.. REDMI 17 5Gలో Qualcomm Snapdragon 4 Gen 5 (4nm) చిప్‌సెట్‌ను అందించారు. రెండు మోడళ్లలో 4GB, 6GB LPDDR4X RAM ఆప్షన్లు ఉన్నాయి. మెమరీ ఎక్స్‌టెన్షన్ సదుపాయంతో RAMను 12GB వరకు పెంచుకోవచ్చు. 128GB, 256GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లు లభిస్తాయి.
అదనంగా microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి.
50MP AI కెమెరా
కెమెరా విభాగంలో REDMI 17, REDMI 17 5Gలో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. Dual-Fusion వీడియో రికార్డింగ్ ఫీచర్‌తో ముందు, వెనుక కెమెరాలను ఒకేసారి ఉపయోగించి వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
7500mAh బ్యాటరీ.. 45W ఫాస్ట్ ఛార్జింగ్
రెండు ఫోన్లలోనూ 7500mAh కెపాసిటీ కలిగిన భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45W Turbo Fast Chargingకు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 96 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా అవసరమైన సమయంలో ఇతర స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లను కూడా REDMI 17 సిరీస్ ఫోన్లతో ఛార్జ్ చేసుకోవచ్చు.
