
DNews:10 Dec: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం సంభవించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన డిసెంబర్ 10న మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారి సమీపంలోని ధాతునగర్ వద్ద జరిగింది. అధిక వేగంతో వస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుమధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టడంతో బలంగా మెలికలు తిరిగి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.
ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
