
DNews:05 NOV:హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మంగళవారం జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు కలిసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గి. రామచందర్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై చర్చలు జరిగాయి. అనంతరం జనసేన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
జనసేన నాయకులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సఖ్యతే తెలంగాణలో కూడా కొనసాగుతోంది.
దివంగత నేత మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవసరమైంది. ఈ సీటుకు బీఆర్ఎస్ తరఫున ఆయన సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న, ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు. మరోవైపు, ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వగా, తాజా పరిణామంలో జనసేన బీజేపీ పక్షాన నిలవడం రాజకీయ వాతావరణాన్ని మరింత రగిలించింది.
