
DNews:14 Mar: మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహాలో ఒక పైశాచిక ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో ఓ యువతికి యువకుడు హెచ్‌ఐవీ (HIV) పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు.అన్నోజిగూడకు చెందిన మనోహర్ అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో గతంలో పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరికీ నిశ్చితార్థం (Engagement) కూడా పూర్తయింది.
అయితే, పెళ్లికి ముందే మనోహర్ మరియు అతని తల్లిదండ్రులకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉందని యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ప్రాణహాని ఉంటుందని భావించి యువతి తరపు వారు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు.పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో మనోహర్ యువతిపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను దెబ్బతీయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు.యువతి పెళ్లికి ససేమిరా అనడంతో, మనోహర్ తన వెంట తెచ్చుకున్న హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తం ఉన్న ఇంజెక్షన్‌ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు.
ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత యువతికి విపరీతమైన జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
