
DNews:13 Dec: సర్పంచ్ బరిలో నిలిచిన తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అతడి అక్క గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కథలాపూర్ మండలంలోని గంభీర్‌పూర్ గ్రామంలో జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేశాడు. గురువారం ఎన్నికలు జరగగా, అదే రోజు రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో రాజశేఖర్ ఓడిపోవడంతో ఈ వార్తను తట్టుకోలేక అతడి అక్క కొక్కుల మమత (38) తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గంభీర్‌పూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
