
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేలకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవం కల్పించింది. మాజీ క్రికెటర్ మాధవ్ మంత్రి పేరును కూడా వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు పెట్టాలని ఎంసీఏ నిర్ణయించింది.
ఎంసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు. వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు సచిన్ తెందుల్కర్, అజింక్య రహానే, మాధవ్ మంత్రి పేర్లను పెట్టనున్నట్లు తెలిపారు.
అదే సమయంలో ముంబయి క్రికెట్‌కు అనుబంధంగా ఉన్న క్లబ్‌లకు రానున్న పదేళ్లలో రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ అందించాలని ఎంసీఏ నిర్ణయించింది. గత ఏజీఎంలో ఈ నిధిని రూ.100 కోట్లుగా నిర్ణయించగా.. తాజాగా దాన్ని రూ.500 కోట్లకు పెంచారు. క్షేత్రస్థాయిలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు లాజిస్టిక్స్, క్రీడా సామగ్రి వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అజింక్య నాయక్ తెలిపారు.
క్రికెట్ అభివృద్ధి కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎంసీఏ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర అర్హాద్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు మిలింద్ నర్వేకర్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.
సచిన్ తెందుల్కర్, అజింక్య రహానే, మాధవ్ మంత్రి ముగ్గురూ ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్‌కు సేవలందించారు. ముఖ్యంగా రహానే నాయకత్వంలో ముంబయి జట్టు రంజీ ట్రోఫీలో పలు విజయాలు సాధించింది. తాజాగా ఆటకు వీడ్కోలు పలికిన రహానేకు వాంఖడేలోనే ఈ ప్రత్యేక గౌరవం దక్కడం విశేషంగా మారింది.
