
DNews:10 Jan: సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ నగరవాసులు భారీ సంఖ్యలో పల్లెబాట పట్టారు. శనివారం ఉదయం నుండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్ మరియు పంతంగి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు వెళ్లాలని, అలాగే గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వారు సాగర్ హైవేని ఎంచుకోవాలని కోరారు.
మరోవైపు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్ కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. అయితే, సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో జనాలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం కూడా గంటన్నరకు పైగా వేచి చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
