
DNews:24 Dec: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ రానున్న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, పండుగ సీజన్లో అల్లర్లు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా వందకు పైగా ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించే వారు, రాష్ డ్రైవింగ్ మరియు రేసింగ్‌లకు పాల్పడే యువతపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పబ్‌లు, హోటళ్లు మరియు ఈవెంట్ నిర్వాహకులు అర్ధరాత్రి ఒంటి గంట కల్లా వేడుకలను ముగించాలని, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం 15 ప్రత్యేక షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఉంచుతాయని, వేధింపులకు పాల్పడే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు కేవలం తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని, ఎవరూ చట్టాన్ని అతిక్రమించి ఇబ్బందుల్లో పడకూడదని సీపీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
