
DNews:24 Dec: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో నవంబర్ 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో అతి వేగంగా వచ్చిన కంకర లోడ్ టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బస్సులోని 18 మంది ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్‌తో కలిపి మొత్తం 19 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డ ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఓవర్‌లోడ్‌తో పాటు అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని నిర్ధారించారు. ఈ క్రమంలో టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ పక్కన టిప్పర్‌లోనే ఉన్న లచ్చు నాయక్ కూడా తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనాన్ని అధిక లోడుతో నడిపించేందుకు యజమానిగా అనుమతి ఇచ్చినందువల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. తొలుత టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేపై కేసు నమోదు చేసినప్పటికీ, దర్యాప్తులో ప్రమాదానికి అసలు కారణం యజమాని నిర్లక్ష్యమేనని తేలడంతో అతడినే ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు.ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు విచారణను మరింత వేగవంతం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
