
DNews:18 Feb: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్‌ను వెలువరించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏప్రిల్‌లో పదవీకాలం ముగియనున్న ఇద్దరు సభ్యుల స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26న ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన చేపట్టి, ఉపసంహరణకు మార్చి 9వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. సురేష్ రెడ్డి బీఆర్ఎస్ తరపున, సింఘ్వీ కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ బలాబలాల ప్రకారం, ఖాళీ అవుతున్న ఈ రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల నగారాతో రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే ఆశావహుల సందడి మొదలైంది.
